మహిళలు, చిన్నారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు తమ పని పట్ల నిబద్ధతతో ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Ravindra) అన్నారు. గచ్చిబౌలిలో నూతనంగా పునర్నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రిసెప్షన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని, కౌన్సెలర్లు సహనంతో వ్యవహరించాలని, వారి సహాయం కోరే వ్యక్తుల సమస్యలను వినాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లోని తాజాగా పునరుద్ధరించిన పిల్లల ఆట స్థలం, రిసెప్షన్ ఏరియా, కౌన్సెలింగ్ గదులను ఆయన పరిశీలించారు. గృహహింస, వివాహేతర బంధం, సహజీవనం, పోక్సో చట్టం ఫిర్యాదుల నమోదు తదితర కారణాలపై కమిషనర్ ఆరా తీశారు.