రాష్ట్రంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. గతంలో కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు భారీగా తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మద్యం ధరల పెరుగుదలతోనే, రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయనుందని సమాచారం. ఈ క్రమంలో బీర్ బాటిల్ పై 10 రూపాయల వరకు తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మద్యంపై 17 శాతం కోవిడ్ సెస్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో బీర్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది మద్యం ధరలు పెంచడంతో అమ్మకాలు పెద్దగా జరగకపోవడంతో గోడౌన్లలో నిల్వలు పెరిగిపోయాయి. దీంతో వేసవిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగే అవకావం ఉన్న నేపథ్యంలో బీరు ధరలను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీరు ధర 180 నుంచి 200 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే.