ATA @USA: అమెరికాలో అట్ట‌హాసంగా `ఆటా` స‌భ‌లు

అమెరికాలో ఆటా స‌భ‌ల‌కు వెళ్ల‌డానికి ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు విమానం ఎక్కేశారు.

  • Written By:
  • Updated On - July 1, 2022 / 04:48 PM IST

అమెరికాలో ఆటా స‌భ‌ల‌కు వెళ్ల‌డానికి ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు విమానం ఎక్కేశారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 17వ మహాసభల్లో పాల్గొన‌డానికి అమెరికా చేరుకున్నారు. మూడు రోజుల పాటు వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి. సెల‌బ్రిటీలు, సినీ క‌ళాకారులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు అమెరికా చేరుకున్నారు. గ‌త మూడేళ్లుగా కోవిడ్ కార‌ణంగా ఇలాంటి ఉత్స‌వాల‌కు దూరంగా ఉన్న తెలుగు ఎన్నారైలు ఈసారి ఆటా స‌భ‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డానికి భారీ ఏర్పాట్లు చేశారు.

తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డానికి పెవిలియ‌న్ల‌ను ఏర్పాటు చేశారు. వాటిని ఆయా రాష్ట్రాల మంత్రులు ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భార‌త కాల‌మానం ప్ర‌కారం జులై 2న మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రవాసులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 8 గంటలకు దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే మీటింగ్ లో ఆమె పాల్గొంటారు. ఆటా ప్రైమ్ మీట్ పబ్లిక్ మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు.

బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ఈ ఆటా మూడు రోజుల స‌భ‌ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి వాలంటీర్లు శ్రమిస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు, యూత్ కన్వెన్షన్ జరగనున్నాయి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్టు ఆ సంఘం అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు) ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినీ నటులు ఉత్సవాలకు కోసం వ‌చ్చార‌ని భువనేశ్‌ తెలిపారు. క్రికెటర్లు కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌ కూడా హాజరవుతారని చెప్పారు. యూత్‌ కన్వెన్షన్‌లో పాల్గొనాలని కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఆట సభల సందర్భంగా నిర్వహించే మ్యాట్రిమోనియల్ ఈవెంట్స్ లో పాల్గొనడానికి అవినాష్ మ్యారేజ్ బ్యూరో యజమాని డీవీ కోటిరెడ్డి అమెరికా వెళ్లారు. ఆట నిర్వాహకుల ఆహ్వానం మేరకు కోటిరెడ్డి ఈవెంట్స్ లో పాల్గొన్నారు.