Site icon HashtagU Telugu

TTD: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం..!

Ttd

Ttd

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానంలో, శ్రీవారి ఆర్జిత సేవ‌లు ఈరోజు నుంచే పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రేండేళ్ళ త‌ర్వాత భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర‌త‌ కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏకాంతంగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు క‌రోనా తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో, మళ్లీ ఈరోజు నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు మొదలయ్యాయి.

ఈ నేప‌ధ్యంలో వెంక‌న్న భక్తులు నేటి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలుగా టీటీడీ ఆన్లైన్ ద్వారా సేవా టికెట్‌లను విక్రయించింది. అంతే కాకుండా ఎక్కువ‌గా డిమాండ్ ఉన్న సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం లాంటి ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా లక్కీ డిప్ విధానం ద్వారా కేటాయింపులు చేశారు టీడీపీ అధికారులు. అయితే సాంకేతిక ఇబ్బందులు కార‌ణంగా వృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్ల ఆన్ లైన్ విడుదలను ఏప్రిల్ 1 నుండి 8 కి వాయిదా వేసింది టీటీడీ. దీంతో ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు వృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నామ‌ని టీడీపీ అధికారుల తెలిపారు. ఈ క్ర‌మంలో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రతిరోజు వెయ్యి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.