Site icon HashtagU Telugu

PSLV C-52: తిరుమలలో “ఇస్రో” ప్రత్యేక పూజలు.. పీఎస్‌ఎల్వీ లాంచింగ్‌కు సర్వం సిద్ధం

Pslv C52

Pslv C52

ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం తిరుమలకు విచ్చేసి, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన లాంచ్ చేయనున్న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ 52(పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్ర‌మంలో రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.

ఇక‌పోతే ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి కూడా పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుంచి ఈనెల 14వ తేదీన ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ 52 నింగిలోకి దూసుకెళ్లనుంది. స‌తీష్‌ ధావన్ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ఏడాది ఇది మొదటి రాకెట్‌ ప్రయోగం కావడ గ‌మ‌నార్హం. ఇక ఈ రాకెట్‌ ద్వారా ఆర్‌ఐశాట్‌-1ఏ తోపాటు ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

Exit mobile version