Vikarabad TRS: ప్రగతి భవన్ కు వికారాబాద్ నేతల పంచాయితీ!

అధికార పార్టీ టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి.

  • Written By:
  • Updated On - August 12, 2022 / 11:26 AM IST

అధికార పార్టీ టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక జిల్లాలో వర్గ విభేధాలు, ఆధిపత్య ధోరణి లాంటి అంశాలు టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలోనూ నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తలుపులు తట్టారు. కేసీఆర్ ఆగస్టు 16న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. జిల్లాలోని నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీ చైర్‌పర్సన్‌ల మధ్య విభేదాలు గ్రూపువివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవల మర్పల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి పర్యటించడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.

ఆమెకు సొంత పార్టీ కార్యకర్తలే ఘెరావ్ చేశారు. ఘటన అనంతరం ఆనంద్ మద్దతుదారులు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో విభేదాలు ఉన్న జెడ్పీ చైర్‌పర్సన్ మహేందర్‌రెడ్డి భార్య. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా జెడ్పీ చైర్‌పర్సన్ మర్పల్లి పర్యటనకు వస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్‌కు చేరింది, వివాదాలకు దూరంగా ఉండి నాయకులు, కార్యకర్తలందరినీ వెంట తీసుకెళ్లి పనిచేయాలని కోరారు. అయితే సమస్య ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. గురువారం సీఎంతో జిల్లా నేతలు సమావేశమయ్యారు. అన్ని విబేధాలు మరిచి పార్టీ కోసం పనిచేయాలని కేసీఆర్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 16న జరిగే బహిరంగ సభకు జనం తరలిరావడంపై దృష్టి సారించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.జిల్లాలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.