Site icon HashtagU Telugu

India Lose: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

Team India

Team India

సఫారీ టూర్‌లో వన్డే సిరీస్ అయినా గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రెండో వన్డేలోనూ ఆధిపత్యం కనబరిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో భారత్ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు సునాయాసంగా ఛేదించేశారు. ఓపెనర్లు డికాక్, మలాన్ ఇచ్చిన ఆరంభానికి తోడు… కెప్టెన్ బవుమా , డస్సెన్, మర్‌క్రమ్‌ కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా మరో 2 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. అంతకుముందు భారత్ 287 పరుగులు చేసింది. వికెట్ కీపర్ పంత్ 85, కెప్టెన్ కెఎల్ రాహుల్ 55 , శార్థూల్ ఠాకూర్ 40 పరుగులతో రాణించారు. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.

నిజానికి ఆతిథ్య జట్టుతో పోలిస్తే వన్డేల్లో టీమిండియానే బలమైన జట్టు. బలమైన బ్యాటింగ్ లైనప్… పదునైన పేస్ బౌలింగ్‌ ఉండడంతో సిరీస్ గెలుస్తుందని అంచనా వేశారు. అయితే మైదానంలోకి వచ్చాక సీన్ రివర్సైంది. అంచనాలకు తగ్గట్టు రాణించలేక వరుస మ్యాచ్‌లలో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయింది. తొలి వన్డేలో ఓటమికి మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం కారణమైతే… రెండో వన్డేలో బౌలర్లు పేలవ ప్రదర్శన కారణంగా చెప్పొచ్చు. అదే సమయంలో బ్యాటింగ్‌లోనూ కీలక ఆటగాళ్ళు దూకుడుగా ఆడలేకపోవడం ప్రభావం చూపింది. ఓపెనర్లు ధావన్, రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ పంత్ రాణించినా… కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం దెబ్బతీసింది. వెంకటేశ్ అయ్యర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. చివర్లో శార్థూల్ ఠాకూర్ ధాటిగా ఆడకుంటే టీమిండియా మరింత తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.

రెండో వన్డేలో భారత బౌలింగ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని సఫారీ బ్యాటర్లపై మన బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆ జట్టు బ్యాటర్లు స్వేఛ్ఛగా ఆడడంతో 288 పరుగుల టార్గెట్‌ చిన్నబోయింది. కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌కు ఈ ఫలితం నిరాశను కలిగించేదే. కోహ్లీతో పోల్చి చూడడం సరికాకున్నా సారథిగా రాహుల్‌కు మైనస్ మార్కులే పడ్డాయి. జట్టును దూకుడుగా లీడ్ చేయలేకపోయాడన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అలాగే కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్‌ వ్యూహాలు కూడా సక్సెస్ కాకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఏదైతేనేం భారీ అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌లోనూ పరాజయం పాలవడం ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు.

Cover Photo Courtesy- BCCI/Twitter

 

 

Exit mobile version