Site icon HashtagU Telugu

Whitewash: భారత్‌ను వైట్‌వాష్ చేసిన సౌతాఫ్రికా

south africa ODI

south africa ODI

భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0తో వైట్‌వాష్ చేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. డికాక్‌తో పాటు డస్సెన్‌ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు రాణించి సఫారీలను 300 లోపే కట్టడి చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, దీపక్ చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో టీమిండియా త్వరగానే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయినా… ధావన్, కోహ్లీ ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ధావన్ 61 పరుగులకు ఔటవగా.. కోహ్లీ 65 రన్స్ చేశాడు. వీరి వికెట్లు చేజార్చుకున్న తర్వాత భారత్‌ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా సఫారీ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. సూర్యకుమార్ 39 , శ్రేయస్ అయ్యర్ 26 పరుగులకు ఔటయ్యాక భారత్ ఓటమి ఖాయమనిపించింది.

ఈ దశలో దీపక్ చాహర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. సఫారీ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న దీపక్ చాహర్ కేవలం 34 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. దీంతో వైట్ వాష్ ప్రమాదం తప్పించుకునేలా కనిపించింది. అయితే దీపక్ ఔటయ్యాక… చేయాల్సిన పరుగులు తక్కువగానే ఉన్నా టెయిలెండర్లు చేతులెత్తేశారు. 18 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో బుమ్రా, యజ్వేంద్ర చహల్ ఔటవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. చివరికి 4 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా 3-0 సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఒక సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అవడం ఇది ఐదోసారి. చివరిసారిగా న్యూజిలాండ్ చేతిలో 2020లో భారత్‌ 0-3తో వైట్‌వాష్‌ ఎదుర్కొంది.

Cover Pic Courtesy– BCCI Twitter