Site icon HashtagU Telugu

1st ODI: సఫారీలదే తొలి వన్డే…

south africa cricket

south africa cricket

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు త్వరగానే ఔటైనా… కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన వీరిద్దరూ మూడో వికెట్‌కు 204 పరుగుల రికార్డ్ స్థాయి పార్టనర్‌షిప్ నమోదు చేశారు. ఏ ఒక్క భారత బౌలర్ వీరిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. బవుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో 110 రన్స్ చేయగా…

డస్సెన్ 96 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 2 , అశ్విన్ 1 వికెట్ తీసుకోగా… మిగిలిన వారంతా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. బౌలింగ్ వరకూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను బౌలింగ్‌కు దించకపోవడం విమర్శలకు తావిచ్చింది.

297 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైనా… ధావన్, కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ నిరాశపరిచారు. తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో టెయిలెండర్లు కూడా ఏం చేయలేకపోయారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Cover Pic Courtesy-@OfficialCSA/Twitter