Sorry Not Found : అకస్మాత్తుగా చైనా విదేశాంగ మంత్రి పదవిని కోల్పోయిన క్విన్ గ్యాంగ్ ఆచూకీ ఇంకా దొరకలేదు.
ఆయన ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియడం లేదు..
తాజాగా మరో విషయం బయటికి వచ్చింది.
చైనా విదేశాంగ శాఖ అధికారిక వెబ్ సైట్ లో గతంలో విదేశాంగ మంత్రులుగా పనిచేసిన వారి పేర్లతో లిస్ట్ కూడా ఉంటుంది.
అయితే ఈ లిస్టులో ఇప్పుడు క్విన్ గ్యాంగ్ పేరు లేదు.
చైనా విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ పేరును సెర్చ్ చేస్తే.. “క్షమించండి.. క్విన్ గ్యాంగ్ కనిపించడం లేదు” అనే ఆన్సర్ వస్తోంది. దీంతో అందులో ఉన్న క్విన్ గ్యాంగ్ ఫోటోలు, ప్రొఫైల్ వివరాలు, విదేశీ పర్యటన సమాచారాన్ని డిలీట్ చేశారని తేటతెల్లమైంది. క్విన్ గ్యాంగ్ పై తీవ్ర అభియోగాలు నమోదైనందునే చైనా సర్కారు ఈవిధంగా చేసి ఉండొచ్చని అంటున్నారు. గత వారం చైనా యొక్క అత్యున్నత శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించిన కొన్ని గంటల తర్వాత విదేశాంగ శాఖ పోర్టల్ నుంచి మాజీ మంత్రి క్విన్ గ్యాంగ్ వివరాలు డిలీట్ అయ్యాయని చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో గత నెల రోజులుగా మిస్ అయిన క్విన్ గ్యాంగ్ కు ఏమైంది ? ఎక్కడికి వెళ్లారు ?(Sorry Not Found) అనే దానిపై మళ్ళీ చర్చ మొదలైంది.