Aadhaar Services: ఇక పోస్ట్ మ్యాన్ లతో ఇంటికే ఆధార్ సేవలు!

దేశంలోని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Aadhar

Aadhar

దేశంలోని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్నారు. 130 కోట్ల జనాభా లోని ఎంతోమందికి ప్రతిరోజు ఏదో ఒక ఆధార్ సేవ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ సేవా కేంద్రాలు వారందరి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చ లేకపోతున్నాయి. ఈనేపథ్యంలో
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన చేసింది. తొలి విడతగా భారత తపాలా చెల్లింపు బ్యాంకు (ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు)కు చెందిన 48 వేల మంది పోస్టుమ్యాన్లకు ఆధార్ సేవలపై శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించింది. రెండో విడతలో మొత్తం 1.5 లక్షల మంది తపాలా సిబ్బందికి శిక్షణ అందించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌, పాన్‌ నంబర్‌ అనుసంధానం, వివరాల అప్‌డేట్‌, చిన్న పిల్లలకు ఆధార్‌ కార్డు పొందడం వంటి సేవలను ఇంటి దగ్గరే పొందొచ్చని తెలిపింది. ఆధార్‌ సేవలు పొందేందుకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. దేశంలోని 755 జిల్లాల్లో చెరొక ఆధార్‌ సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు యూఐడీఏఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలోని 7,224 బ్లాకుల్లో మినీ ఆధార్‌ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

  Last Updated: 11 Jun 2022, 04:58 PM IST