Karnataka Election 2023 : ఇవాళ ప్రచార బరిలోకి సోనియా

బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక ఎన్నికలను (Karnataka Election 2023) కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు దిగ్గజ నేతలు ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Soniaa

బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక ఎన్నికలను (Karnataka Election 2023) కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు దిగ్గజ నేతలు ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రాష్ట్రం అంతటా సుడిగాలి పర్యటన చేస్తుండగా.. ఇక సోనియా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ (శనివారం) హుబ్లీలో పార్టీ అభ్యర్థుల కోసం సోనియా ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ నాయకులు మాణికం ఠాగూర్‌, ప్రసాద్‌ అబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హుబ్లీలో జరిగే ఎన్నికల (Karnataka Election 2023) ర్యాలీతో పాటు ధార్వాడ్‌ జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం సోనియా ప్రచారం చేయనున్నారు. హుబ్లీ సెటిల్‌మెంట్‌ ప్రాంతంలోని యంగ్‌ స్టార్ట్స్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే బహిరంగ సభలో సోనియా పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో సోనియాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొననున్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం సోనియా తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు.

ధార్వాడ్ జిల్లాలోనే ఎందుకంటే .. 

ధార్వాడ్ జిల్లాలోనే సోనియా ప్రచారం చేయడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే.. ధార్వాడ్‌ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థుల్లో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రధాని మోడీ ప్రచారానికి బలంగా కౌంటర్ ఇచ్చే వ్యూహంలో భాగంగానే సోనియా గాంధీ ప్రచారానికి వస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో కర్ణాటకలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ 10-15 ర్యాలీలు, రోడ్‌షో ప్రచారాలలో పాల్గొంటారు. పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య కూడా 28 బహిరంగ సభలను నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ 19 కార్యక్రమాలలో పాల్గొంటారు. మరోవైపు జేడీ(ఎస్) కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 50 నుంచి 60 ఈవెంట్లలో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కనిపించనున్నారు. అయితే ఆయన ఇప్పటివరకు తన కుమారుడు పోటీ చేస్తున్న చన్నపేట, రామనగర్‌లో పర్యటించలేదు.

  Last Updated: 06 May 2023, 09:02 AM IST