Sonia Gandhi : సోనియాగాంధీ తల్లికి కన్నీటి వీడ్కోలు..!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కాలం చేశారు.

  • Written By:
  • Updated On - August 31, 2022 / 10:44 PM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో ఇటలీలోని స్వగృహంలో ఈ నెల 27న శనివారం కన్నుమూశారు.ఆమె అంత్యక్రియలు మంగళవారం ముగిసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ రోజు ట్వీట్ చేశారు. సోనియా గాంధీ తల్లి పోలా మైనోకు 90 ఏళ్లు. ఆమె గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తల్లిని చూడటానికి సోనియా గాంధీ తరచూ ఇటలీ వెళ్లేవారు.గత రెండేళ్లలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ అమ్మమ్మను చూడటానికి తరచుగా ఇటలీ వెళ్లివచ్చేవారు.

అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లిని పరామర్శించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23న ఇటలీ వెళ్లారు. సోనియా గాంధీతోపాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పోలా మైనో అంత్యక్రియలకు హాజరయ్యారు. పోలా మైనో మరణవార్త తెలిసి కాంగ్రెస్ నేతలు పలువురు సంతాపం తెలిపారు. ఇట‌లీకి చెందిన సోనియాగాంధీని రాజీవ్‌గాంధీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సోనియాగాంధీ తల్లి మరణించిన తర్వాత రోజు ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో కూడా సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.