Sonia Gandhi: పీసీసీ చీఫ్ లకు ‘సోనియా’ షాక్.. ప్రక్షాళన షురూ!

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం కావడం పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 09:11 PM IST

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం కావడం పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మరియు మణిపూర్ రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను రాజీనామా చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రకారం.. పార్టీ రాష్ట్ర విభాగాలను ప్రక్షాళనను వేగవంతం చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ అధ్యక్షులను పీసీసీల పునర్వ్యవస్థీకరణకుగానూ రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అజయ్ కుమార్ లల్లూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. నమీరక్పామ్ లోకేన్ సింగ్ మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గణేష్ గోడియాల్ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ మంగళవారం రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో తమ అవకాశాలను పునరుద్ధరించుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తృణమూల్ కాంగ్రెస్‌ల నుండి ఎదురవుతున్న సవాల్‌ను తిప్పికొట్టాలని ఆశించిన కాంగ్రెస్‌కు ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.