AP Special Status: ప్రత్యేక హోదా ర‌గ‌డ‌.. సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 03:07 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌స్తుతం ప్రత్యేక హోదా పాలిటిక్స్ న‌డుస్తున్నాయి. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు అవకాశం కల్పించింది. అయితే ఈ సమావేశంలో చ‌ర్చించాల్సిన అంశాల‌ను సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ‌, ఆ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చింది. అయితే సాయంత్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ‌. దీంతో ఏపీలో ఒక్క‌సారిగా ప్ర‌త్యేక పాలిటిక్స్ మొద‌ల‌య్యాయి. ఈ నేప‌ధ్యంలో అధికార, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై మ‌రొకరు విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెంచేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ వివాదం పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఫిబ్ర‌వ‌రి17వ తేదీన జరిగే సమావేశంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపైనే చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్చ ఉండదని, ప్రత్యేక హోదా అంశంపై కావాలంటే మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించుకోవచ్చని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర‌ హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో పొరపాటున ప్ర‌త్యేక హోదా అంశాన్ని చేర్చారని చెప్పారు. ప్రత్యేక హోదా అంశానికి తెలంగాణకి సంబంధం లేదని, త్రిసభ్య కమిటీ సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ అందుకే తొలగించిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.