మృత్యువు ఎప్పుడూ ఏ రూపంలో ఎటునుంచి ముంచుకొస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవారు మరుక్షణమే చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు. మరి కొన్ని సంఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. తాజాగా అటువంటి దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ ఆరుగురి ని బలితీసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈశాన్య దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఒక కుటుంబం నివసిస్తోంది.
తాజాగా గురువారం రాత్రి దోమలను తరిమేందుకు వీరు మస్కిటో కాయిల్ ను అంటించి పడుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఈ కాయిల్ పరుపు పై పడి మెల్లిగా అంటుకుని పొగ అలుముకుంది. అటు కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఉన్నాయి. పరిస్థితిని గమనించి వారు బయటపడేందుకు ప్రయత్నించినా విషపూరిత వాయువులను పీల్చి వారు స్పృహ తప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం 9 మంది ఉండగా వీరిలో ఆరుగురు విగతజీవులుగా కన్పించారు. మిగతా ముగ్గురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా విష వాయువులు పీల్చడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. ఆ తర్వాత ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు పోలీసులు వెల్లడించారు. ఒక మస్కిటో కాయిల్ వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. మిగిలిన ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.