Site icon HashtagU Telugu

AP Major Fire: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. రియాక్టర్ పేలడంతో ఐదుగురు సజీవదహనం

fire

fire

ఏలూరు జిల్లాలో పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మసునూరు మండలంలోని అక్కిరెడ్డి గూడెంలో ఉన్న ఈ పరిశ్రమలో జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరొకరు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడినవారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే వారికి మెరుగైన చికిత్స కోసం ఇప్పటికే విజయవాడకు తరలించారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఔషధాల తయారీలో ఉపయోగించే ఒకరకమైన పొడిని తయారుచేస్తున్నట్టు సమాచారం.

పరిశ్రమలోని నాలుగో యూనిట్ లో జరిగిన ప్రమాదంలో ముందు మంటలు చెలరేగాయి. రియాక్టరే పేలిపోయింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అక్కడి తప్పించుకునే అవకాశం లేకే.. ఘటనాస్థలిలోనే ఐదుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో నలుగురు బీహార్ కు చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్టులో దాదాపు 150 పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

అగ్నిమాపక సిబ్బందికి ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యలు చేపట్టాయి. ఇప్పటికే సంఘటన స్థలాన్ని ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో మంటలు చెలరేగిన తరువాత గేట్లు తీయలేదు. దీంతో చాలామంది బలవంతంగా లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే మంటలు అక్కడున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఎక్కువమందిని కాపాడే పరిస్థితి లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

నిజానికి ఇది చక్కెర కర్మాగారమని.. దానినే రసాయన పరిశ్రమగా మార్చారని.. అందుకే ఇలాంటి ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం సంగతి తెలిసినా కంపెనీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. కనీసం అంబులెన్స్ కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.