సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం రేగింది. వేలంలో జట్టు కూర్పుకు సంబంధించి విభేదాలు తలెత్తడంతో ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవి నుండి తప్పుకున్నాడు. మెగా వేలం ముగిసిన నాలుగురోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ సీజన్ కోసం అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కటిచ్ వేలంలో పలువురు ఆటగాళ్ళను సూచించగా.. ఫ్రాంచైజీ యాజమాన్యం పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కటిచ్ తన పదవికి రాజీనామా చేసాడని టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. వేలంలో సన్‌రైజర్స్ పలువురు స్టార్ ప్లేయర్స్‌ను వదిలేసి, అనామకుల కోసం కోట్లు వెచ్చించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత సీజన్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ వేలానికి ముందు ప్రక్షాళన చేపట్టింది. సీజన్ మధ్యలోనే డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుండి తప్పించిన సన్‌రైజర్స్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించింది. అయినప్పటకీ ప్రదర్శన మెరుగుపడలేదు. దీంతో వేలానికి ముందు విలియమ్సన్, అబ్దుల్ సమాద్ , ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది.
అయితే వేలంలో మాత్రం సన్‌రైజర్స్ ఏమాత్రం వ్యూహం లేకుండా వ్యవహరించింది. పలువురు స్టార్ ప్లేయర్స్ మంచి ధరలకే కొనుగోలు చేసే అవకాశం వచ్చినా ఆ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరిచింది. అనామక క్రికెటర్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించింది. పెద్దగా ఫామ్‌లో లేని నికోలస్ పూరన్ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. అలాగే విండీస్ క్రికెటర్ షెపర్డ్ కోసం 7.75 కోట్లు, సీన్ ఎబోట్ కోసం 2.4 కోట్లు ఖర్చు చేసింది. ఓవరాల్‌గా వేలంలో అంచనాలున్న స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేయలేకపోయింది. కేవలం కాఫీ తాగడానికే వేలానికి వచ్చారా అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజాగా సైమన్ కటిచ్ రాజీనామాతో ఆ ఫ్రాంచైజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కటిచ్ వేలానికి ముందు పలువురు క్రికెటర్ల పేర్లు సూచించినా కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న బడ్జెట్‌తోనే కటిచ్ ఆటగాళ్ళ పేర్లను ప్రతిపాదించగా.. యాజమాన్యం మాత్రం వాటిని పట్టించుకోలేదని సమాచారం. వేలం తర్వాత సన్‌రైజర్స్ యాజమాన్యంతో దీనిపై వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో తన పదవి నుండి తప్పుకోవాలని కటిచ్ నిర్ణయించుకుని రాజీనామా చేసినట్టు టెలిగ్రాఫ్ కథనం ఇచ్చింది.