Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2 న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఇందులో సిగ్నల్ అవాంతరాలు తెరపైకి వచ్చాయి. దీని కారణంగా ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ విఫలమైందని తేల్చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐకి విశ్వసనీయ సమాచారం అందినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కోరమాండల్ క్రాష్ కావడానికి ముందే సిగ్నల్ లోపం గుర్తించినట్టు వెల్లడైంది.
సీబీఐ విచారణలో తేలింది ఏంటంటే… జూన్ 2వ తేదీ ఉదయం సిబ్బంది లోపం గురించి బహనాగా బజార్ స్టేషన్‌లోని అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కి సమాచారం అందించారు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ (ASM) సాంకేతిక నిపుణుడిని పిలిచి రైలు నిర్వహణ కోసం సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేయమని అడిగారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో టెక్నీషియన్ సిగ్నల్ సిస్టమ్‌ను సరిచేశారు. అయితే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదో ఏఎస్‌ఎం పరిశీలించలేదు. సాయంత్రానికి మళ్లీ సిగ్నల్ వ్యవస్థలో లోపం ఏర్పడిందని, అందుకు సాక్ష్యంగా ఇంత పెద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం సీబీఐకి అందిందని సమాచారం. ఈ లోపం కారణంగా కోరమాండల్ ప్రధాన లైన్‌కు బదులుగా లూప్ లైన్‌కు మళ్లించబడింది, దానిపై అప్పటికే గూడ్స్ రైలు ఉంది.
ఈ కేసులో కస్టడీలోకి తీసుకున్న స్టేషన్ మాస్టర్, టెక్నీషియన్, మరికొందరు ఉద్యోగులను సీబీఐ రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. జూన్ 2న కోల్‌కతా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బహంగా బజార్ స్టేషన్‌లో గూడ్స్ రైలును ఢీకొని బోల్తాపడింది. ఇంతలో భద్రక్‌కు వస్తున్న యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్‌లోని రెండు కోచ్‌లు కోరమాండల్ కోచ్‌ను ఢీకొని పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్లలోని 288 మంది ప్రయాణికులు మృతి చెందగా, 1200 మందికి పైగా గాయపడ్డారు.
Read More: AP Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం!