Site icon HashtagU Telugu

IPL 2022: కోల్ కతా కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్

Shreyas

Shreyas

ఊహించిందే జరిగింది…అంతా అనుకున్నట్టు గానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోల్ కత్తా టీమ్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్‌ను రూ.12.25 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.2020లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయాస్ ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. కోల్‌కతా వంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు తాను చాలా గౌరవంగా భావిస్తున్నట్టుగా శ్రేయాస్ వెల్లడించాడు. నిజానికి కెప్టెన్సీ విషయంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో శ్రేయాస్ కు విభేదాలు వచ్చాయి. 2021 సీజన్ కు ముందు గాయంతో అయ్యర్ తప్పుకోవడంతో ఢిల్లీ రిషబ్ పంత్ కు పగ్గాలు అప్పగించింది.

అయితే శ్రేయాస్ గాయం నుండి కోలుకుని వచ్చిన తర్వాత కూడా పంత్ నే సారథిగా కొనసాగించడంతో అయ్యర్ నొచ్చుకున్నాడు. దీంతో తాను వేలంలో వెళ్లేందుకు నిర్ణయించుకోవడం ఢిల్లీ అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఊహించినట్టుగానే వేలంలో అయ్యర్ భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో ఈసారి వేలంలో బరిలోకి నిలిచిన అయ్యర్ ను చివరికి రూ12.25 కోట్లతో కేకేఆర్ కైవసం చేసుకుంది.మొత్తంగా ఏడు ఐపీఎల్‌ సీజన్లు ఆడిన అయ్యర్‌ 87 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 2375 పరుగులు చేశాడు.

కోల్ కత్తా ఐపీఎల్ జట్టుకు అయ్యర్ ఆరో కెప్టెన్. ఇప్పటివరకు కోల్‌కతా టీంకి మెక్ కల్లమ్, గంగూలీ, గంభీర్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీగా వ్యవహరించారు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012 మరియు 2014లో కోల్‌కతా జట్టు రెండుసార్లు IPL కప్ గెలుచుకుంది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో అనూహ్య విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన కేకేఆర్‌ ఈ సారి పక్కా ప్రణాళిక ప్రకారం జట్టును ఎంచుకుని మరో టైటిల్‌ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రిటెయిన్‌ చేసుకున్నవారిలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌, అజింక్య రహానె వంటి సీనియర్లు.. మరోవైపు ప్యాట్‌ కమిన్స్‌, నితీశ్ రాణా, టిమ్‌ సౌథీ వంటి ప్లేయర్స్ ఉన్నారు.