Uttar Pradesh: మనుషులనే కాదు.. మనతో పాటు ఈ భూమిపై జీవించే జంతువులు, పక్షులను కూడా చంపడం నేరమే. కొన్ని జంతువుల మాంసం తినడం లేదా వాటిని చంపడం కూడా చట్టాల ప్రకారం నేరం అవుతుంది. ఈ భూమండలంపై మనషులకు జీవించే స్వేచ్చ ఎంత ఉందో.. జంతువులకు కూడా జీవించే స్వేచ్ఛ ఉంది. తాజాగా ఎలుకను చంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఓ వ్యక్తి ఎలుకను చంపేశాడు. ఎలుక తోకకు రాయి కట్టి దాన్ని నీళ్లల్లో ముంచి చంపేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఆ వ్యక్తిపై 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గత ఏడాది నవంబర్‌లో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుకకు రాయి కట్టి ములుగు కాల్వలోకి విసిరేశాడు. దీంతో ఆ ఎలుక చనిపోయింది. దీనిని చూసిన జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జంతువును క్రూరంగా చంపేశాడని, జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 429తో పాటు జంతు హింస నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం కోసం ఎలుక కళేబరాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. దీనిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్పెక్షన్ కారణంగా చనిపోయినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా 30 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశాడు. అతడికి జంతు హింస నిరోధక చట్టం ప్రకారం అతడికి మూడేళ్ల, ఐపీసీ 429 కింద ఐదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముంది.