Mamatha Banerjee: మమతా బెనర్జీకి షాక్.. లీగల్ నోటీసులు పంపిన ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు?

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగలింది. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆమెకు లీగల్ నోటీసులు పంపాడు. మంగళవారం ఈ విషయాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్వయంగా ప్రకటించాడు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 08:39 PM IST

Mamatha Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగలింది. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆమెకు లీగల్ నోటీసులు పంపాడు. మంగళవారం ఈ విషయాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్వయంగా ప్రకటించాడు. తన సినిమాను కించపరిచేలా మాట్లాడినందుకు, పరువు తీసినందుకు సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపాడు. సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఉందని ఆమె విమర్శలు చేసినందుకు లీగల్ నోటీసులు పంపించినట్లు స్పష్టం చేశారు.

వివేక్ అగ్నిహోత్రితో పాటు ఆయన భార్య పల్లివి జోష్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి లీగల్ నోటీసులను పంపారు. ఈ మేరకు లీగల్ నోటీసు కాపీని తన ట్విట్టర్ లో వివేక్ అగ్నిహోత్రి షేర్ చేశాడు. అయితే కేరళలో లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడులు జరిగాయనే అంశంపై వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. రాజకీయంగా బీజేపీ, ఇతర పార్టీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నాయి.

తమిళనాడులో సినిమా ప్రదర్శనను ప్రభుత్వం నిలిపివేయగా.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏకంగా సినిమాపై నిషేధం విధించింది. రాష్ట్రంలో సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మమతా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వివేక్ అగ్నిహోత్రి మండిపడుతున్నాడు. అందులో భాగంగా మమతాకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపాడు.

వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై సీఎంవో కార్యాలయం స్పందించింది. తమ కార్యాలయానికి ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపింది.తమకు ఎలాంటి సమాచారం రాలేదని, వచ్చిన తర్వాత మమతా దృష్టికి తీసుకెళ్తామన్నారు.