Site icon HashtagU Telugu

Manchu family Controversy: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. అరెస్ట్ తప్పదా?

Manchu Family Controversy

Manchu Family Controversy

Manchu family Controversy: సినీ నటుడు మోహన్‌బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్ ఎదురైంది. విలేకరిపై దాడి కేసులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మోహన్‌బాబుకు అనారోగ్యం ఉన్నట్లు, గుండె మరియు నరాల సంబంధిత సమస్యలు, మతిమరుపు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నారని, ఇటీవల దుబాయ్‌లో తన మనవడిని కలవడానికి వెళ్లి తిరిగి తిరుపతికి వచ్చి, విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నారని ఆయన చెప్పుకున్నారు. దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.

హైకోర్టులో జరిగిన వాదనలు:

పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోహన్‌బాబుకు చెందిన ఫాంహౌస్‌లో ఈనెల 10న చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన విలేకరిపై మోహన్‌బాబు దాడి చేసి, అతన్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ప్రక్రియలో పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేశారు.

మోహన్‌బాబు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, అతనిని అరెస్టు చేయకుండా తదుపరి దర్యాప్తు జరపకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ కె. లక్ష్మణ్‌ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేసిన విధానంపై ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు.

గాయపడిన విలేకరితో మోహన్‌బాబుకు ఎటువంటి పరిచయమూ లేదని, అతను ఎవరో కూడా తెలియకపోవడం, అలాంటప్పుడు హత్యాయత్నం చేయడం అసాధ్యం అని పేర్కొన్నారు. అలాగే, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరైనవే కాదని, ఈ సంఘటన అనుకోకుండా జరిగినదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ, మోహన్‌బాబు పై కేసు మొదట పహాడీషరీఫ్‌ పోలీసులు నమోదు చేసిన తరువాత, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా సెక్షన్లు జోడించారని తెలిపారు. ఈ కేసులో మోహన్‌బాబు విచారణకు హాజరయ్యే అవసరం ఉందని, అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయకుండా పిటిషన్‌ను తిరస్కరించారు.

అయితే, విచారణకు హాజరైన రోజే ట్రయల్‌ కోర్టులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కింది కోర్టును ఆదేశించాలని ఈ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో పహాడీషరీఫ్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.