Sharad Pawar: రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన శరద్ పవార్ నిర్ణయంతో ఎన్‌సిపి సంబరాలు చేసుకుంటుంది. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ బయట పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Sharad Pawar

Sharad Pawar

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన శరద్ పవార్ నిర్ణయంతో ఎన్‌సిపి సంబరాలు చేసుకుంటుంది. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ బయట పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రెండు రోజుల క్రితం ఎన్సీపీ ఛీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన పవార్.. ఇవాళ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్సీపీ ఛీఫ్ గా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు పవార్ ప్రకటించారు. దీంతో ఈ రాజీనామా డ్రామాకు తెరపడినట్లయింది.

గత కొద్దీ రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి. ఆ పదవికి శరద్ పవార్ రాజీనామా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పవార్ నిర్ణయం పార్టీలోని వ్యక్తులకు, కార్యకర్తలకు మింగుడుపడలేదు. దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే శరద్ పవార్ రాజీనామాను ఆ పార్టీ శుక్రవారం తిరస్కరించింది. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయన రాజీనామా తర్వాత ఆయన వారసుని ఎంపిక కోసం ఏర్పాటైన కోర్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు.

శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ వెలుపల పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు కొత్త ఎన్‌సిపి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన కమిటీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న శరద్ పవార్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసింది.

శరద్ పవార్ మీడియా సమావేశంలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్ హాజరుకాలేదు. దీనికి సంబంధించి ఎన్సీపీ అధినేత మాట్లాడుతూ.. విలేకరుల సమావేశంలో అందరూ ఉండలేరని అన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, మరికొందరు లేరు, కానీ ఈ ఉదయం పార్టీ సీనియర్ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేసి నాకు తెలియజేశారు. అందుకే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని శరద్ పవార్ ఈ సందర్భంగా తెలిపారు.

Read More: Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !

  Last Updated: 05 May 2023, 06:57 PM IST