Parents Begging: మానవత్వమా.. సిగ్గుపడు!

మాయమైపోతున్నాడమ్మా మనిషి అని పాటలు రాస్తే ఆహా ఎంత బాగా రాశారు అనుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 03:29 PM IST

మాయమైపోతున్నాడమ్మా మనిషి అని పాటలు రాస్తే ఆహా ఎంత బాగా రాశారు అనుకున్నారు. కానీ అలాంటి మనుషులు ఇప్పుడు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. బీహార్ లోని ఆ తల్లిదండ్రులు కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అయినా సరే వారిపై కనికారం చూపించలేదు ఆ ఆసుపత్రి సిబ్బంది. పైగా వారి బిడ్డ శవాన్ని అప్పగించాలంటే లంచం అడిగారు. అసలు వాళ్లు మనుషులేనా? బీహార్ లోని సమస్తిపూర్ లో జరిగిన ఘటన దేశం మొత్తాన్ని కదిలిస్తోంది. మహేశ్ ఠాకూర్ కుమారుడు కొన్నాళ్ల కిందటి నుంచి కనిపించకుండా పోయాడు. తరువాత అతడు చనిపోయాడని.. సమస్తిపూర్ లోని సర్దార్ ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉందని వచ్చి తీసుకెళ్లాలని ఠాకూర్ కు ఫోన్ వచ్చింది. తీరా ఆసుపత్రికి వెళితే.. అక్కడి లంచం పిశాచులు.. రూ.50,000 ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామన్నారు.

తినడానికే నానాపాట్లు పడుతున్న ఠాకూర్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో వేరే దారి ఊరంతా తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. దీనిని వీడియో తీసినవాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆసుపత్రి తీరుపై, సిబ్బంది ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నవారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే అని.. వారికి కొన్నాళ్లుగా జీతాలు లేవని.. అందుకే రోగుల బంధువుల నుంచి ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లోకల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా సరే.. ఇలా శవాన్ని అప్పగించడానికి కూడా డబ్బులు వసూలు చేస్తారా? అని జనం మండిపడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతామంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పటికే దీనిపై ఎంక్వయిరీ చేస్తున్నట్టు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ వినయ్ కుమార్ రాయ్ తెలిపారు.