Journalist Arrested: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్

వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 08:25 AM IST

వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తామిద్దరమే ఇంట్లో ఉన్న సమయంలో సీఐడీ పోలీసులు వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లినట్లు అంకబాబు భార్య చెప్పారు. అంకబాబు ఈనాడు, ఉదయం దినపత్రికలలో జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పని చేశారు. అంకబాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ విచారిస్తున్నారు. ఆయన భార్యకు నోటీస్ ఇచ్చినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు, ప్రభుత్వానికి ముడిపెట్టి వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేసినందునే అదుపులోకి తీసుకున్నట్లు ఆ వర్గాల సమాచారం. విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం నాయకులు, ఒక న్యాయవాది గుంటూరు వెళ్లారు. కేసులు నమోదు చేసే సెక్షన్ల ఆధారంగా పోలీస్ స్టేషన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. రిమాండ్ విధిస్తే, ఆ తరువాత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు.

అంకబాబును విడుదల చేయాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్‌‌ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. అతనిని వెంటనే విడుదల చేయాలని డీజీపీకి లేఖ రాశారు. కేవలం వాట్సాప్ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేసిన కారణంగానే అరెస్ట్ చెయడం అన్యాయం అన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆయనను విడుదల చేయాలని కోరారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని టీడీపీ జాతీయ కార్యదర్శులు లోకేష్, వర్ల రామయ్య, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

కాగా, అంకబాబు అరెస్టును వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతలు చావా రవి, కొండా రాజేశ్వరరావు,నిమ్మరాజు చలపతిరావు,ఆర్. వసంత్ తదితరులు ఖండించారు.