Umran Malik:సౌతాఫ్రికాతో సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ ?

ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ లో మారుమోగిపోతున్న పేరు..తన బుల్లెట్ల లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తేస్తున్న యువ పేసర్.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 11:42 PM IST

ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ లో మారుమోగిపోతున్న పేరు..తన బుల్లెట్ల లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తేస్తున్న యువ పేసర్. ప్రతీ మ్యాచ్ లోనూ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. కేవలం మాజీ క్రికెటర్లే కాదు రాజకీయ నాయకులు సైతం అతని బౌలింగ్ ఫిదా అయిపోయారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉమ్రాన్ మాలిక్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. అతన్ని భారత జట్టులోకి తీసుకోవాలంటూ సూచించారు. వారి అంచాలకు తగ్గట్టే ఉమ్రాన్ త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణాప్రికాతో తలపడబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లోనే ఈ సిరీస్ ఆరంభం కాబోతోన్నందున.. దేశీయ పిచ్‌లపై నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్‌కు బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిస్తారని సమాచారం.

నెట్ బౌలర్ గా సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన ఈ యువపేసర్ ఇప్పుడు కీలక బౌలర్ గా మారిపోయాడు. సన్ రైజర్స్ విజయాల్లో ఉమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్ల జోరుకు బ్రేక్ వేస్తున్నాడు. కోల్ కత్తాతో మ్యాచ్ లో ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉండగా కేవలం రెండే పరుగులు ఇచ్చాడంటే అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. పంజాబ్ జోరుకు కళ్ళెం వేస్తూ చెలరేగిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు నేలకూల్చాడు. ఒడియన్ స్మిత్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరాలను పెవిలియన్ కు పంపాడు. ఈ ప్రదర్శనే విమర్శకులను సైతం ఫిదా చేసింది. దీంతో పాటు నిలకడగా వేగాన్ని కొనసాగిస్తూ బౌలింగ్ చేస్తుండడంతో సెలక్టర్ల దృష్టి పడినట్టు భావిస్తున్నారు. టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు జరిగే సిరీస్ లలో ఉమ్రాన్ మాలిక్ కు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే పలువురు సీనియర్లు విశ్రాంతి తీసుకునే సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లకు ఉమ్రాన్ ఎంపికయ్యే అవకాశముంది. ఈ సిరీస్ లలో చెలరేగితే ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకుంటాడని చెప్పొచ్చు.