Site icon HashtagU Telugu

Bhadrachalam : ఉప్పొంగుతున్న గోదావ‌రి.. భ‌ద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

bhadrachalam

bhadrachalam

భద్రాచలం వద్ద గోదావరి నదికి సోమవారం ఉదయం 7.30 గంటలకు వరద 49.40 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరుగుతూ సాయంత్రానికి 53 అడుగుల‌కు చేరే అవ‌కాశం ఉంది. సాయంత్రానికి మూడో హెచ్చ‌రిక జారీ చేసే అవ‌కాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7.56 గంటలకు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ (ఎస్ ఏసీ బీ) వద్ద నీటిమట్టం 4.40 అడుగులకు చేరింది. కోనసీమలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి నీరు చేరుతోంది. అయినవల్లి, పి. గన్నవరం, ఐ. పోలవరం, మామిడికుదురు, అంబాజీపేట, ముమ్మిడివరం, మల్కిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునకు గురికావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పి. గన్నవరం, అల్లవరం, మామిడికుదురు మండలాల్లోని గ్రామస్తులు బోటు రాకపోకలను నిలిపివేశారు.

చెట్లు నేలకొరగడం, వాటి నివాసాలు నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోటిపల్లి-ముక్తేశ్వరం వద్ద కాజ్‌వే జలమయం కావడంతో స్థానికంగా బోటింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరదల వల్ల వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. కోనసీమ జిల్లా ఎస్‌ ఏసీ బీ వద్ద వరద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో తమ పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణం కంటే ఎక్కువగా వరద ఉధృతంగా ప్రవహిస్తే తమ పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, తీవ్ర ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.