Russia And Ukraine: ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్.. ఫలించని రెండో దశ చర్చలు..!

  • Written By:
  • Publish Date - March 4, 2022 / 10:29 AM IST

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీక‌ర‌ యుద్ధం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రోవైపు ఈ రెండు దేశాల మ‌ధ్య రెండో దశ చర్చ‌లు బెలార‌స్-పోలాండ్ దేశాల మ‌ధ్య జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల్లో భాగంగా, సాధారణ పౌరులను తరలింపునకు ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయాని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో భాగంగా బాంబు దాడుల్లో సామన్య పౌరులు మరణిస్తున్నక్ర‌మంలో పౌరులు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు చేరుకునేలా ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు.

అంతకుముందు ఉక్రెయిన్‌ బృందంలోని సభ్యుడైన స్థానిక ప్రజాప్రతినిధి డేవిడ్ అరాఖమియా మాట్లాడుతూ.. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం హ్యూమానిటేరియన్‌ కారిడార్‌ల‌ ఏర్పాటుపై ఒప్పందం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు చర్చలు జరిగినప్పటికీ తమ దాడులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ నిస్సైనీకరణే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేసింది. రష్యా మాత్రం తమ డిమాండ్లను అంగీకరించడంలో ఆలస్యం చేస్తే మరింత జాబితా పెరుగుతుందని హెచ్చరించింది. ఏది ఏమైనా ఉక్రెయిన్‌,ర‌ష్యాల మ‌ధ్య‌ రెండో దశ‌ చర్చలు కూడా అనుకున్న స్థాయిలో స‌ఫ‌లం కాలేదని స‌మాచారం.