Missing Fishermen : స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మత్స్యకారుల గ‌ల్లంతు

  • Written By:
  • Updated On - July 7, 2022 / 07:00 AM IST

మచిలీపట్నంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కోసం పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మత్స్యకారుల ఫోన్ కాల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేవీకి చెందిన మూడు బోట్లు, ఒక హెలికాప్టర్ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిన్న మస్తాన్, చిన్నంచారయ్య, నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావులు శనివారం గిలకలదిండి నుంచి పడవపై సముద్రంలో వేటకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో అంతర్వేది సమీపంలో బోటు చెడిపోయిందని బోటు యజమాని ఏడుకొండలుకు ఫోన్ చేశారు. కొందరు మరమ్మత్తులు చేసి పడవను తీసుకురావడానికి మరో పడవలో వెళ్లారు. అయితే అక్కడ పడవ కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారు.

మత్స్యకారులు వేట ముగించుకుని మంగళవారం తిరిగి రావాల్సి ఉంది. అయితే వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని చొరవతో కోస్ట్‌గార్డు రంగంలోకి దిగింది. కాకినాడ-అంతర్వేది, అంతర్వేది-మచిలీపట్నం మధ్య హైస్పీడ్ బోట్లతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే నలుగురు వ్యక్తులు ఆచూకీ లభించలేదు. నేవీ హెలికాప్టర్ సుమారు మూడు గంటల పాటు వెతికి రాత్రి ఆగింది. ఈరోజు మళ్లీ గాంలిపు చ‌ర్య‌లను ప్రారంభించారు.