Site icon HashtagU Telugu

Moon Farm: చంద్రుడి చెంత ‘వ్యవసాయం’

Moon

Moon

చంద్రుడిపై వ్యవసాయం చేయగలుగుతామా ? పంటలు పండించగలుగుతామా ? అనే దిశగా శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే చంద్రుడి పై నుంచి తెచ్చిన మట్టిలో తొలిసారిగా మొక్కలు పెంచారు. నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు విజయవంతంగా మొక్కలను పెంచారు. దీంతో భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అతిపెద్ద ముందడుగుగా చెప్పొచ్చు. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని ‘రెగోలిత్’ అని పిలుస్తారు. అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి అడుగుపెట్టిన అప్పటి శాస్త్రవేత్తలు ఈ ‘రెగోలిత్’ను భూమికి తీసుకొచ్చారు.

దాదాపు 50 ఏళ్లుగా చంద్రుడి మట్టిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా.. ‘అరబిడోప్సిస్ థాలియానా’ అనే మొక్కను పెంచారు. భూమిపై పెరిగే మొక్కల హార్మోన్లను, అంకురోత్పత్తి ప్రక్రియను చంద్రుడిపై ఉన్న మట్టి ప్రభావితం చేయలేదని తాజా ప్రయోగం రుజువుచేసింది. ‘చంద్రుడిపై మొక్కలను పెంచితే ఆక్సిజన్‌ ఉత్పత్తి సాధ్యమే. దీంతో ఆవాసాల ఏర్పాటు మరింత సులభమవుతుంది. అలాగే, భవిష్యత్తులో భూమి నుంచి చేపట్టే రోదసి మిషన్లను చంద్రుడి నుంచే ప్రారంభించవచ్చు. దీంతో రాకెట్‌ ఇంధనం ఖర్చూ కలిసొస్తుంది’ అని ఫ్లోరిడా వర్సిటీ హార్టికల్చరల్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్‌ రాబ్‌ ఫెర్ల్‌ అన్నారు. కాగా, చంద్రుడి మట్టిలో మున్ముందు అంతరిక్షంలోనే ఆహార పంటల సాగు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాముల కోసం ఆహార వనరులను అక్కడే అభివృద్ధి చేయడానికి ఈరకంగా ఇతర గ్రహాలపై ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Exit mobile version