Site icon HashtagU Telugu

Human Embryo : అండం , వీర్యకణాలు లేకుండానే పిండం..అదేలా అనుకుంటున్నారా..?

Scientists Create 'Human Embryo Model' Without Sperm Or Egg

Scientists Create 'Human Embryo Model' Without Sperm Or Egg

పురుషుల వీర్యకణాలు.. మహిళల్లోని అండాలు కలిసి ఫలదీకరణం చెందితేనే పిండం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పిండం.. నవమాసాలు తల్లి గర్భాశయంలో ఎదిగి శిశువుగా బయటకు వస్తుంది. ఇది ఇప్పటివరకు అందరికి తెలిసిందే. కానీ ఇక ఇప్పుడు అండం,వీర్యకణాలు అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు నిరూపించారు. అదికూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించటం విశేషం.

ఇజ్రాయెల్‌ లోని వీజ్ మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Israel Weizmann Institute of Science) పరిశోధకులు ఈ అద్భుతం సృష్టించారు. అండం, వీర్యకణాలు లేకుండా ప్రయోగశాలలో పెంచిన మూలకణాల(Stem cells) నుంచి సేకరించిన 14 రోజుల వయసున్న మానవ పిండాల(Human Embryo) సింథటిక్ నమూనాలను విజయవంతంగా రూపొందించారు. నేచర్ జర్నల్‌లో దీనికి సంబంధించిన ఇన్ఫో ప్రచురితమైంది. వంధ్యత్వం, పుట్టుకతో వచ్చే లోపాలు, అవయవ పెరుగుదలపై పరిశోధనకు ఇది కొత్త మార్గాలను తెరిచింది.

Read Also :  Juices: మీ స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే ఈ జ్యూసులు తాగాల్సిందే?

మానవ పిండాన్ని అభివృద్ది చేయడానికి కంటే ముందు వీళ్లు ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్‌ సెల్స్‌ను ల్యాబ్‌లోని ఒక కంటైనర్‌లో భద్రపరిచారు. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్‌ చేశారు. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు, అండాలు లేకుండా స్టెమ్‌ సెల్స్‌ ఫలదీకరణం చెంది.. అండం ఏర్పడింది. ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇప్పుడు కృత్రిమంగా మానవ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్నే పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవ పిండంలో ఉన్నట్లుగానే ప్లాసెంటా, యోక్‌ సాక్‌, క్రోనిక్‌ సాక్‌, ఇతర కణజాలాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్లుగానే ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రయోగం పెను సంచలనంగా మారింది.

మాలిక్యులర్ బయాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ హన్నా నేతృత్వంలో, వీజ్మాన్ బృందం రెండు రకాల మూల కణాలతో పరిశోధనను స్టార్ట్ చేసింది. అవి వయోజన చర్మ కణాల నుంచి తిరిగి ప్రోగ్రామ్ చేశారు. 2013లో హన్నా అభివృద్ధి చేసిన ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. ఇంప్లాంటేషన్‌కు సిద్ధంగా ఉన్న 7 రోజుల పిండాన్ని పోలిన మునుపటి స్థితికి మార్చారు. మూలకణాలను పిండం, పచ్చసొన, మావి అనే మూడు గ్రూపులుగా విభజించారు. ఆప్టిమైజ్డ్ పరిస్థితులలో కలిపినప్పుడు, సుమారు ఒకశాతం గోళ ఆకారంలో ఉన్న సింథటిక్ పిండాలుగా స్వీయ-వ్యవస్థీకృతమై 14 రోజుల వయస్సు ఉన్న మానవ పిండానికి చెందిన సంక్లిష్ట నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. పిండం అభివృద్ది చెందడానికి కావాల్సిన ఆక్సిజన్‌, న్యూట్రిషన్స్‌ అందించే ప్లాసెంటాగా ట్రోపోబ్లాస్ట్‌ సెల్స్‌ అభివృద్ధి చెందాయి. ఇక హైపోబ్లాస్ట్‌ కణాలు యోక్‌ సాక్‌ సపోర్టింగ్‌గా ఉండగా.. ఎక్స్‌ట్రాఎంబ్రియోనిక్‌ మెసొడెర్మ్ పిండం నిర్మాణంలో సహాయపడ్డాయి.

ల్యాబ్‌ల్లో కృత్రిమ పిండం అభివృద్ధి చేయడం వల్ల వైద్య రంగం, మెడిసిన్‌ తయారీల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో గర్భిణులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించరు. దీంతో మానవ గర్భాశయంలోని పిండం అభివృద్ధి చెందే సమయంలో ఏ మెడిసిన్‌ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై స్పష్టత తక్కువగా ఉంది. కాబట్టి కృత్రిమ పిండాలు అభివృద్ధి చేయడం వల్ల వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కృత్రిమ పిండం రోజులదేనని.. నెలలు నిండినా కొద్దీ అవయవాలు అభివృద్ధి చెందడం మొదలవుతుందని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ జాకబ్‌ హన్నా వివరించారు.