UGC NET 2024: UGC-NET 2024 పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణ ఆధారంగా పరీక్షను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, పరీక్షను రద్దు చేసి దాదాపు రెండు నెలలు గడిచిపోయాయని, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో తాజాగా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత దశలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్‌ను స్వీకరించడం అనేది అనిశ్చితిని పెంచుతుందని తెలిపారు. ధర్మాసనంలో న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు కూడా ఉన్నారు.
UGC-NET అభ్యర్థుల బృందం తాజాగా పరీక్షను నిర్వహించాలనే నిర్ణయాన్ని నిలిపివేసేందుకు పిటిషన్‌లో సుప్రీంకోర్టును తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. సిబిఐ దర్యాప్తులో ఇటీవల వెల్లడైన ఫలితాల దృష్ట్యా, మొత్తం పరీక్షను రద్దు చేయాలనే నిర్ణయం ఏకపక్షం మాత్రమే కాదు, అన్యాయం కూడా అని పేర్కొంది. పరీక్షను రద్దు చేయడం వల్ల అభ్యర్థులకు విపరీతమైన బాధ, ఆందోళన, వనరుల వృథా అవుతున్నాయని పిటిషనర్లు తమ పిటిషన్‌లో వాదించారు.
తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా పరీక్షను రద్దు చేయడం న్యాయం ఘోర వైఫల్యమేనని పిటిషన్లో తెలిపారు. ఇది భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయబద్ధత మరియు ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు పరీక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తక్షణమే విచారణ జరపాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జూన్ 19న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ నగరాల్లో ఒక రోజు ముందు నిర్వహించబడిన UGC-NET 2024 పరీక్షను రద్దు చేసింది.
Also Read: Anna-Canteens : ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం : సీఎం చంద్రబాబు