Site icon HashtagU Telugu

MLA Mewani Case: మేవానీ అరెస్ట్‌.. గుజ‌రాత్‌, అస్సాం స‌ర్కార్‌ల‌కు ఎస్సీ క‌మీష‌న్ నోటీసులు

Jignesh

Jignesh

వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్టుపై గుజ‌రాత్ , అస్సాం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎస్సీ క‌మీష‌న్ నోటీసులు జారీ చేసింది. అసోం, గుజరాత్‌లో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మంగళవారం రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నోటీసులో పేర్కొంది. అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న దళిత్ అధికార్ మంచ్ సంస్థ కన్వీనర్ కిరీట్ రాథోడ్ ఈ పిటిషన్‌ను సమర్పించారు.

ఈ నోటీసును పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా మరేదైనా విధానంలో అందిన 30 రోజులలోపు ఆరోపణలు/విషయాలపై తీసుకున్న చర్యలపై వాస్తవాలు, సమాచారాన్ని సమర్పించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని ఎస్సీ క‌మీష‌న్ సీఎస్‌ల‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కోంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు గుజరాత్ పోలీసులతో సమన్వయం చేసి అరెస్టు చేసిన తీరు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని రాథోడ్ తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఈ అరెస్టు గుర్తించబడిందని… ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) కాపీని అందించకపోవడం, లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం తదితర ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జ‌రిగాయ‌ని రాథోడ్ తెలిపారు.