Site icon HashtagU Telugu

Bandi: పాతబస్తీ సభతో సత్తా చాటాం.. మరోసారి చరిత్ర సృష్టిస్తాం

Whatsapp Image 2022 04 06 At 21.29.52 Imresizer

Whatsapp Image 2022 04 06 At 21.29.52 Imresizer

హైదరాబాద్ లోని పాతబస్తీ నుండి తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. పాతబస్తీకి పోయి సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించాం. బీజేపీ ఎక్కడికైనా పోగలదు. ప్రజల కోసం ఎంతకైనా తెగించగలదనే సంకేతాలను పంపించాము. ఆనాడు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాష్ట్ర శాఖ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను స్పూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని జాతీయ నాయకత్వం పేర్కొన్నదంటే అది మనందరికీ గర్వకారణం. ఈసారి కూడా అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నాం. అమ్మవారి ఆశీస్సులతో కార్యకర్తల కృషి, ప్రజల మద్దతులో చేపట్టే ఈ యాత్రతో తెలంగాణలో మరో చరిత్ర సృష్టిద్దాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో… పాదయాత్ర ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతి కుమార్, సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, కుమ్మరి శంకర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు హాజరయ్యారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ప్రజా సమస్యల గుర్తింపుతో పాటు పాదయాత్ర పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు… ప్రజల భాగస్వామ్యం, కార్యకర్తల కృషి, జాతీయ నాయకత్వం సహకారంతో మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని వర్గాల ప్రజలను కలిశాం. వారి సమస్యలను తెలుసుకున్నాం. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా చూశాం.

కేంద్ర పథకాల తీరు తెన్నులను పరిశీలించాం. ప్రజలకు ఎలాంటి పాలన కావాలో అడిగి తెలుసుకున్నాం. అందులో భాగంగానే ఉచిత విద్య, వైద్యం వంటి హామీలిచ్చాం. ప్రజల కోసం బీజేపీ నేతలు తెగించి కొట్లాడతారనే నమ్మకాన్ని కలిగించాం. హిందువుల్లో ఐక్యత కోసం కృషి చేశాం. ఈనెల 14 నుండి చేపట్టబోయే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో చరిత్ర సృష్టిద్దాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తున్నారు. అంబేద్కర్ ను అవమానించిన కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలనే లక్ష్యంతోనే అంబేద్కర్ జయంతి రోజున రెండో విడత పాదయాత్ర చేపడుతున్నాం అని వెల్లడించారు బండి సంజయ్.

పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు బండి సంజయ్. పాదయాత్ర జరిగే రోజుల్లో వీలు చూసుకుని వస్తానని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చెప్పారు. రెండో విడత పాదయాత్రకు సైతం కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. కల్వకుంట్ల అరాచక పాలనపై ప్రజలు విసిగెత్తిన నేపథ్యంలో పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేయండి. స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి ప్రజలు పాదయాత్రకు వచ్చేలా అవగాహన కల్పించండి. తెలంగాణ కోసం పోరాటాలు చేసి కేసీఆర్ పాలనలో వివక్షకు గురవుతున్న తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది. పెద్ద నాయకులతోపాటు వార్డు మెంబర్ మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నందున వారందరినీ గుర్తించి పార్టీలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్.

Exit mobile version