Site icon HashtagU Telugu

Outer Railway Line: ఔటర్ రింగ్ రోడ్ తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్

Hyderabad Orr

Hyderabad Orr

హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 563.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేను చేపట్టాలని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన స్థల నిర్ధారణ చేపట్టి, డీపీఆర్ రూపొందించడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్ల కేటాయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే.. నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు నగరం గుండా వెళ్లే రైల్వే లైన్లపై ఒత్తిడి తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దేశంలో ఈ తరహాలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ నిర్మించడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తున్నారు. దీనికి సమాంతరంగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలోని విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, కర్నూలు, వికారాబాద్, కర్నూలు, ముంబై, కరీంనగర్‌ల నుంచి వచ్చే రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ రైల్వే మార్గాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. కొత్తగా నిర్మించనున్న ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ వల్ల అనేక పట్టణాలు, గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి మరింత సులభంగా చేరుకునే అవకాశం ఉన్నది. 538 కిలోమీటర్ల పొడవైన ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

Also Read: Xiaomi Layoffs: షియోమీ ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు..? కారణమిదేనా..?