ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ సర్కార్ పై పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని, రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జగన్‌కు ఇచ్చిన అవకాశం అయిపోయిందని, రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రస్తకే లేదని తేల్చి చెప్పిన సజ్జల రామకృష్ణ , కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు తమకు ఐదేళ్ళ సమయం ఇచ్చారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. ఇక ప్రజలను భ్రమల్లో ఉంచుతూ వారిని మోసం చేసేవారే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.