Site icon HashtagU Telugu

Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 29కి వాయిదా!

Sajjala Bhargav Reddy

Sajjala Bhargav Reddy

ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. సజ్జల భార్గవ్ రెడ్డి 8 కేసులపై ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిగింది, తిరిగి విచారణ ఈ నెల 29 కి వాయిదా పడింది.

సజ్జల భార్గవ్ రెడ్డి తరపున పిటిషనర్ వాదనలు ముగించారు. ఆయన తెలిపిన దాని ప్రకారం, ఏపీలో పోలీసులపై అధికారపక్ష ఒత్తిడి ప్రభావం కనపడుతుంది. వరుసగా అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఆయనను ఇబ్బంది పెడుతున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. ‘‘ఒకే పోస్ట్‌ పెట్టిన కారణంగా, శ్రీకాకుళం నుండి కుప్పం వరకు రాష్ట్రమంతా కేసులు పెడుతున్నారు’’ అని వాదించారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు.

అలాగే, వందల సంఖ్యలో కేసులు పెడతామని, అందువల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. ‘‘ప్రస్తుతం 9 కేసులున్నప్పటికీ, వాటి సంఖ్య 90కి మించినట్లుగా కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే, ప్రభుత్వం తరఫున హైకోర్టుకు ప్రవేశపెట్టిన న్యాయవాది, ‘‘కేసుల నమోదు ప్రక్రియకు సంబంధించి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని’’ పేర్కొన్నారు. ‘‘అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తుల స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినట్లు’’ వివరించారు. ఈ మొత్తం పిటిషన్లపై 29 తేదీన విచారణ జరగనున్నట్టు ఏపీ హైకోర్టు ప్రకటించింది.