Chiranjeevi: చిరంజీవితోపాటు శబరిమలకు వెళ్లిన ఆ మహిళ ఎవరు? అసలు నిజమేంటి?

మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని..

  • Written By:
  • Updated On - February 17, 2022 / 11:30 AM IST

మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని.. అలాంటప్పుడు ఆలయ వర్గాలు ఆవిడను దర్శనానికి ఎలా అనుమతించారన్నది వివాదం. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆలయ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. చిరంజీవి దంపతులతో పాటు వచ్చినవారు సురేష్ చుక్కపల్లి, ఆయన సతీమణి మధుమతి చుక్కపల్లి అని.. ఆమె వయసు 55 ఏళ్ల కన్నా ఎక్కువే అని క్లారిటీ ఇచ్చాయి.

శబరిమల ఆలయ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం 10 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల లోపువారికి ఆలయ ప్రవేశానికి, అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉండదు. కానీ చిరంజీవి దంపతులతోపాటు వచ్చిన మహిళ వయసు 55 ఏళ్ల లోపే అని సోషల్ మీడియాలో ప్రచారం చోటుచేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ వర్గాలు తేల్చి చెప్పాయి.

అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 13న శబరిమల ఆలయానికి వెళ్లిన చిరు.. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చిరు దంపతులతోపాటు ఉన్న మధుమతి చుక్కపల్లి వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని భావించిన నెటిజన్లు… శబరిమల ఆలయ నిర్వాహకులు కట్టుబాట్లు దాటారని.. ఆ మహిళను ఎలా అనుమతించారంటూ ప్రచారం చేశారు. ఇది పెద్ద సమస్యగా మారింది. నిజానికి మధుమతి చుక్కపల్లి చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేసే ఫినిక్‌ గ్రూప్ ఛైర్మన్ సురేష్ చుక్కపల్లి భార్యగా, ఆ గ్రూప్ మాజీ డైరెక్టర్ గా సుపరిచితురాలే.

మధుమతి చుక్కపల్లి వయసు 50 ఏళ్ల లోపు ఉన్నా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారన్న సోషల్ మీడియా ప్రచారం పెరగడంతో.. ఆమె కుమారుడు చుక్కపల్లి అవినాష్ దీనిపై ఫేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చారు. ఆమె తన తల్లి అని, ఆమె 1966లో పుట్టారని చెప్పారు. 2017లోనే శబరిమల అయ్యప్పకు కూడిమర్మం విరాళంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. తన వయసు 34 ఏళ్లని అన్నారు. ఈ సమస్యకు పూర్తిగా వివరణ ఇచ్చినందున ఇకపై అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరారు.

శబరిమల ఆలయ నిర్వహణను చూసే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కూడా దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఆన్ లైన్ అసత్య ప్రచారం.. ఆలయానికి వ్యతిరేకంగా జరుగుతోందంటూ ఆవేదన చెందింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి చిరంజీవితోపాటు వచ్చినవారి వయసు 55 ఏళ్ల కన్నా ఎక్కువే అని.. దయచేసి దీనిపై అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరింది. మధుమతి చుక్కపల్లి వయసుపై వివాదం చోటుచేసుకోవడంతో మరొక విషయం కూడా చెప్పారు. మధుమతి తన ఆధార్ కార్డును కూడా చూపించారని ఆ తరువాతే ఆలయానికి వెళ్లారన్నారు. ఆమె గతంలో కూడా అయ్యప్పను దర్శించుకున్నారని చెప్పారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. చట్టపరంగా అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. మొత్తానికి అలా ఈ వివాదానికి అటు చుక్కపల్లి కుటుంబం నుంచి ఇటు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నుంచి వచ్చిన వివరణలు ఫుల్ స్టాప్ పెట్టాయి.