ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న క్రమంలో, అక్కడ ఖార్కీవ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. క్షిపణులు, ఫిరంగులతో దాడులకు దిగుతుండటంతో పౌరులు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని నగరంలోని కీవ్‌లో డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు పేలుళ్లు జరగడంతో, అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు.
ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి, రష్యా సైనిక దాడులు కారణఃగా, ఉక్రెయిన్ సైనికులతో పాటు ఆ దేశ పౌరులు మరణించగా, వేలమందికి గాయాలు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా కూడా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 500 మంది సైనికులు చనిపోయారని, అలాగే 1500 మందికి పైగానే రష్యన్ సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఇప్పటికే 6వేల మంది సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించగా, రష్యా ఖండించింది. ఇక మరోవైపు ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. అంతే కాకుండా మరియుపొల్, ఖర్కివ్ నగరాలను కూడా రష్యా దిగ్బంధించిందని సమాచారం.