Hypersonic Missile: శత్రువులను గుడ్డివాళ్ళుగా మార్చే ఆయుధాలను ప్రయోగించిన రష్యా

రష్యా మరో నూతన హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

రష్యా మరో నూతన హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యమున్న జిర్కాన్‌ క్షిపణిని బారెంట్స్ సముద్రం నుంచి ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. వైట్ సీ లో 1,016 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా సముద్రం లోపల ఉన్న జలాంతర్గామి నుంచి జిర్కాన్‌ క్షిపణిని పరీక్షించినట్లు రష్యా తెలిపింది. జిర్కాన్‌ హైపర్‌సోనిక్ క్షిపణి అత్యాధునికమైన టెక్నాలజీతో తయారైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు.

గత నెలలో కూడా ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై తాము కింజాల్ హైపర్‌ సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. అవి 1,500 నుంచి 2,000 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగలవని, దానితో పాటు ఖండాంతర క్షిపణి సర్మత్‌ని కూడా ప్రయోగించినట్లు తెలిపింది.

ఉక్రెయిన్ సైనిక దళాలు ప్రయోగించిన డ్రోన్‌లను పేల్చి వేసేందుకు శక్తివంతమైన కొత్త తరం లేజర్ ఆయుధం జదిరాను కూడా గత వారం ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. అయితే యుద్ధ నిబంధనల ప్రకారం నిషేధించిన ఇలాంటి ఆయుధాలు ఉక్రేనియన్‌ డ్రోన్లను, ఫిరంగి దళాలను నాశనం చేయడంతోపాటు సైనికులను అంధులుగా చేస్తాయని నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.