RCB Win:ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 01:52 AM IST

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుస ఓటముల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోటీపడుతున్న రోహిత్‌సేన తాజాగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు ఏకపక్షంగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

బ్రెవిస్ 8 పరుగులకే ఔటవగా.. ఫామ్‌లో ఉన్న తిలక్‌ వర్మ, పొల్లార్డ్ డకౌటయ్యారు. రమణ్‌దీప్‌సింగ్ 6 పరుగులకే ఔటవగా…సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తన ఫామ్ కొనసాగిస్తూ కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 రన్స్ చేశాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది.ఒక దశలో 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబై సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే 150 దాటగలిగింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ 2 , హర్షల్ పటేల్ 2 , అక్షదీప్‌సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు ధాటిగా ఆడారు. డుప్లెసిస్ , అనూజ్ రావత్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. డుప్లెసిస్ 16 పరుగులకు ఔటైనా… మరో ఓపెనర్ అనూజ్ రావత్ , విరాట్ కోహ్లీతో కలిసి అదరగొట్టాడు. భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 47 బంతుల్లోనే 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 66 పరుగులు చేసాడు. రావత్ ఔటైనప్పటకీ విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ బెంగళూరు విజయాన్ని మరింత తేలిక చేశారు. కోహ్లీ 36 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్యపరిచింది. దీంతో బెంగళూరు 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది మూడో విజయం. అటు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఓటమి.