Site icon HashtagU Telugu

Rohit Sharma: రోహిత్‌కు మళ్ళీ జరిమానా

Mumbai Indians

Mumbai Indians

ఐపీఎల్ 15వ సీజన్‌ హోరాహోరీగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న జట్లు కొన్ని నిరాశపరిస్తే… కొత్తగా వచ్చిన టీమ్స్ అదరగొడుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన మాత్రం అత్యంత పేలవంగా ఉంది. వరుసగా ఐదు పరాజయాలతో ఇప్పటి వరకూ పాయింట్ల ఖాతానే తెరవలేదు. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్‌శర్మ మరోసారి జరిమానాకు గురయ్యాడు.

ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు రోహిత్ శర్మకు 24 లక్షల రూపాయల జరిమానా విధించారు. రోహిత్ స్లో ఓవర్ రేట్ ఫైన్ ఎదుర్కోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి. మొదటి సారి ఈ తప్పిదానికి 12 లక్షలు జరిమానాగా చెల్లించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు వేయలేకపోయారు. దీంతో రెండోసారి కూడా అదే తప్పిదం చోటు చేసుకోవడంతో నిబంధనల ప్రకారం.. జరిమానా మొత్తం రెట్టింపు అయింది. దీనితో పాటు జట్టు ఆటగాళ్లందరు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 10 ఆటగాళ్లు ఒక్కొక్కరు ఆరు లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఏది తక్కువ మొత్తం అయితే అది ఫైన్ రూపంలో కట్టాల్సి ఉంటుంది.
ఐసీసీ నిబంధనల ప్రకాం.. టీ20 ఫార్మట్ మ్యాచ్‌‌లో ఒక ఇన్నింగ్ 85 నిమిషాల్లో ముగియాలి. ఇన్నింగ్ ఆరంభమైన 85వ నిమిషంలో చివరి ఓవర్ అంటే.. 20వ ఓవర్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ సమయం దాటితే మాత్రం ఫీల్డింగ్ చేసే జట్టు కెప్టెనే బాధ్యత వహించాలి. ఐపీఎల్‌లో కూడా ఇదే నిబంధనలు ఉన్నాయి. తొలి స్లో ఓవర్ రేట్‌కు కేప్టెన్ 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

రెండోసారి అదే తప్పు జరిగితే ఫైన్ మొత్తం 24 లక్షలకు పెరుగుంది. జట్టులో మిగిలిన ఆటగాళ్ళు కూడా జరిమానా ఎదుర్కొంటారు. ఇదిలా ఉంటే పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోల్తా పడింది. బ్రెవిస్ , తిలక్ వర్మ , సూర్యకుమార్ రాణించినప్పటకీ… అనవసరమైన రనౌట్లు ముంబై ఓటమికి కారణమయ్యాయి. దీంతో ముంబై పాయింట్ల పట్టికలో కింద నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది.