Site icon HashtagU Telugu

Rohit Sharma:బ్యాటింగ్ వైఫల్యంపై రోహిత్ అసహనం

Rohit

Rohit

ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది. తొలి మూడు మ్యాచ్ ల్లోనూ చెత్త బౌలింగ్ తో ఓడిపోయిన ముంబై ఇండియన్స్… శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పేలవ బ్యాటింగ్ తో తేలిపోయింది. ఒక్క సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన వారు దారుణంగా విఫలమయ్యారు. ఇక సీజన్ లో రోహిత్ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఇషాన్ కిషన్ తొలి రెండు మ్యాచ్ ల్లో బాగానే ఆడినా… ఆ తర్వాత గాడి తప్పాడు. అతడి ఆటను చూస్తుంటే పూర్తి ఫిట్ నెస్ తో లేడని కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కారణంగానే కనీస పోటీ ఇచ్చిందని, లేకుంటే పరువు పోయేదని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే జట్టు ఓటమికి కారణమైందన్నాడు. వ్యక్తిగతంగా తన వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తుందన్నాడు. ఈ వికెట్‌పై 150 ప్లస్ టార్గెట్ ఏ మాత్రం సరిపోదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్.. తమ టీమ్ కాంబినేషన్ ఇంకా సెట్ కాలేదన్నాడు.

భారీ లక్ష్యం ఉంటే బౌలర్లకు ఏదైనా చేయడానికి వీలు ఉంటుందన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్ చేయలేకపోయామనీ, ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్‌లపై ఈ స్కోర్లు సరిపోవన్నాడు. ఆర్‌సీబీ వంటి బలమైన ప్రత్యర్థులపై భారీ టార్గెట్స్ ఉండాల్సిందే అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించినప్పుడే విజయం దక్కుతుందనీ రోహిత్ చెప్పుకొచ్చాడు. చాలా విషయాల్లో మా బ్యాటర్లు మెరుగవ్వాలన్న రోహిత్ ఎక్కువ సేపు ఆడేలా సాధన చేయాలన్నాడు. అదొక్కటే తాము వెంటనే మార్చుకోవాల్సి ఉందని చెప్పాడు. వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోందనీ హిట్ మ్యాన్ అంగీకరించాడు. వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా దురదృష్టవశాత్తు రాంగ్ టైమ్‌లో ఔటవుతున్నాననీ చెప్పుకొచ్చాడు.