Site icon HashtagU Telugu

Team India: విండీస్‌పై భారత్ క్లీన్‌స్వీప్

Teamindia

Teamindia

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ విండీస్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, పంత్ రాణిస్తే… బౌలింగ్‌లో సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ అదరగొట్టారు. విండీస్‌పై భారత్‌కు ఇదే తొలి వైట్‌వాష్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాపార్డర్‌ 42 పరుగులకే పెవిలియన్ చేరింది. రోహిత్ 13, పంత్ 10, కోహ్లీ డకౌటవగా… ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో కోలుకుంది. వీరిద్దరూ ఔటయ్యాక.. భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసేలా కనిపించింది. అయితే చివర్లో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ మెరుపులతో భారత్ 266 పరుగులకు ఆలౌటైంది.

ఛేజింగ్‌లో వెస్టిండీస్ మరోసారి చేతులెత్తేసింది. టాపార్డర్, మిడిలార్డర్‌లో కీలక ఆటగాళ్ళందరూ సమిష్టిగా విఫలమయ్యారు. కెప్టెన్ పూరన్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. భారత పేస్ త్రయం ధాటికి విండీస్ 82 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. తర్వాత జోసెఫ్ , స్మిత్ కాసేపు పోరాడినా అప్పటికే ఓటమి ఖాయమైంది. విండీస్ ఇన్నింగ్స్‌కు 169 పరుగుల దగ్గర తెరపడితే…సిరాజ్ 3 , ప్రసిధ్ధ కృష్ణ 3 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా వెస్టిండీస్‌పై వైట్‌వాష్ ఘనత సాధించిన తొలి భారత సారథిగా రోహిత్‌శర్మ రికార్డులకెక్కాడు. అలాగే ఓవరాల్‌గా ఏడో భారత కెప్టెన్‌గానూ ఘనత సాధించాడు. రెండు జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్ ఫిబ్రవరి 16 నుండి కోల్‌కతా వేదికగా మొదలు కానుంది.

Exit mobile version