Site icon HashtagU Telugu

Inia Vs SL: పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ గ్రాండ్ విక్టరీ

Rohit

Rohit

వేదిక మారింది… బంతి కూడా మారింది…అయితే ఫలితం మాత్రం మారలేదు. సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగుతున్న వేళ పింక్‌బాల్ టెస్టులోనూ భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో లంకపై 238 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న రోహిత్‌సేన సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఊహించినట్టుగానే పింక్‌బాల్ టెస్టులో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. పూర్తి వన్‌సైడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మూడోరోజు లంక ఓపెనర్ కరుణారతనే సెంచరీతో కాస్త ప్రతిఘటించినా ఓటమిని తప్పించుకోలేకపోయాడు. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో క్రీజులో నిలదొక్కుకునేందుకు కూడా కష్టపడిన లంక ఇన్నింగ్స్‌ మూడో సెషన్‌లో ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఏడు వికెట్లు పడగొడితే.. బుమ్రా 3 వికెట్లు తీసాడు. ఆట ఆరంభమైనప్పటి నుంచీ శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ తర్వాత ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ రాణించలేదు. కరుణారతనే సెంచరీతో ఒకవైపు పట్టుదలగా ఆడడంతో స్కోర్ 200 దాటగలిగింది. మిగిలిన బ్యాటర్ల నుండి సపోర్ట్ లేకపోవడంతో కరుణారతనే పోరాటం వృథాగానే మిగిలింది. చివరికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 208 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంక నుంచి కనీస పోటీ లేకపోవడంతో ఈ టెస్ట్ కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగుకు ఆలౌటవగా..లంక 109 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 303 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తర్వాత 447 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 208 రన్స్‌కు ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌ను చూస్తే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ , రోహిత్‌శర్మ రాణించారు. పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడితే… అయ్యర్, రోహిత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌లతో రాణించారు. అటు బౌలింగ్‌లో బుమ్రాతో పాటు స్పిన్నర్లూ సమిష్టిగా రాణించడంతో లంక కోలుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ విజయంతో కెప్టెన్‌గా రోహిత్‌శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై 3-0తో టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్, ఆ తర్వాత వెస్టిండీస్‌పై వన్డే, టీ ట్వంటీలనూ స్వీప్ చేసింది. తాజాగా శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌నూ స్వీప్ చేసిన రోహిత్‌సేన ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది. పింక్‌బాల్ టెస్ట్ విజయంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్‌శర్మ రాణిస్తే… బౌలింగ్‌లో బుమ్రాతో పాటు స్పిన్నర్లూ అదరగొట్టారు.