అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు.మాజీ క్రికెటర్లు బరిలో దిగే ‘ రోడ్ సేఫ్టీ సిరీస్’ టోర్నీ రెండో సీజన్ తోనే వీరంతా బరిలోకి దిగబోతున్నారు. మే ఆఖరి వారంలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుందని నిర్వహకులు ప్రకటించారు. వాస్తవానికి ఈ సిరీస్ ఫిబ్రవరి నెలలోనే జరగాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కారణాల వల్ల నిర్వాహకులు వాయిదా వేశారు.రోడ్ సేఫ్టీ సిరీస్’ టోర్నీ 2022 సీజన్ మ్యాచ్ లు లక్నో , ఇండోర్, హైదరాబాద్, విశాఖపట్నం, వేదికలుగా జరగనుండగా.. జూన్ రెండో వారంలో మెగా ఫైనల్ కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
టోర్నీకి సంబందించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ తొలి సీజన్ లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్ టీమ్ విజేతగా నిలిచింది. రాయ్‌పూర్ వేదికగా శ్రీలంక లెజెండ్స్ టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఇండియా లెజెండ్స్.. టైటిల్‌ని కైవసం చేసుకుంది.కోవిడ్ కారణంగా గత సీజన్ మొత్తాన్నీ ఒకే వేదికలో నిర్వహించారు. ఈ సారి కోవిడ్ ప్రభావం తగ్గముఖం పట్టడంతో పలు వేదికల్లో మ్యాచ్ లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో మాజీ క్రికెటర్లు తమ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సారి సీజన్ లోనూ క్రికెట్ వినోదాన్ని అందించేందుకు వారంతా సన్నద్ధమవుతున్నారు. ఇగిలా ఉంటే లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.