Revanth Reddy: కేసీఆర్ అండదండలు ఉండడం వల్లే రాఘవను అరెస్ట్ చేయలేదు

  • Written By:
  • Updated On - January 6, 2022 / 02:32 PM IST

రామకృష్ణ సెల్ఫీ వీడియో, ఆయన కుటుంబం ఆత్మహత్యపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మనుషులు ఇలా మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని రేవంత్ అన్నారు.

సుపరిపాలనను అందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ.. అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు.. మధ్య తరగతి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడి వల్ల ఓ కుటుంబంలోని నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటిదాకా ఆ మానవ మృగాన్ని అరెస్ట్ కూడా చేయలేదని, ఆ కుటుంబం మీద పార్టీపరంగా చర్యలు కూడా తీసుకోలేదని మండిపడ్డారు.

రాఘవ అరాచకాలు సీఎంకు తెలియకపోవడమేంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపైన నిఘాకే పరిమితమైందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారసులు మాఫియాను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో వనమా వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లే పోలీసులు కూడా రాఘవను అరెస్ట్ చేయలేకపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, రాఘవ అంత దారుణంగా మాట్లాడినా సీఎంకు ఎందుకు చర్యలు తీసుకోవాలనిపించడంలేదని ప్రశ్నించారు. ఘటనపై ప్రత్యేక న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు.