Site icon HashtagU Telugu

Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్

Revanth reddy

తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు. మూడు నెలల నుండి రైతుల పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వింత వైఖరి అవలంబిస్తున్నాయని, ఆరు గాలం రైతు కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు లేవని రేవంత్ విమర్శించారు.

ప్రభుత్వాలు, పాలకులు మారినా రైతు తల రాత మారడం లేదని, సూటు బూటు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీని ఉద్దేశించి రేవంత్ విమర్శించారు.
రైతులకు క్షమాపణ చెప్పి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అవే చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు.

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లొంగిపోయారని, ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస సీఎం కేసీఆర్ కి పట్టట్లేదని, మళ్ళీ కొత్త నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకువస్తే సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎటువైపు ఉంటారో చూడాలని రేవంత్ అన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు.

ఇతర రాష్ట్రాలలో నేరుగా కేంద్ర ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తుందని, తెలంగాణ లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్రానికి అమ్ముతుంని రేవంత్ తెలిపారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మోడీ,కేసీఆర్ వైఖరి వల్ల వరి వేసుకునే రైతులు ఉరేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఇతర దేశాలలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేసి నేరుగా అమ్ముకోవచ్చని అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పట్టించుకోకుండా రాజకీయ క్రీడలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు.

మద్దతు ధర ప్రకటించిన పంటలు కొనకపోతే ప్రభుత్వం పై పీడీ యాక్ట్ పెట్టి జైల్ లో వేయాలని రేవంత్ డిమాండ్ చేసారు. రైతులు వరి పంట వేయండని,ఎందుకు కొనడో తాను చూస్తానని రేవంత్ అన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఈ యాసంగిలోవరి వేసాడని, కేసీఆర్ తన సొంత పొలంలో150 ఎకరాలలో వరి పండిస్తున్నాడని తనకొక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా అని రేవంత్ నిలదీశారు. ప్రజలు వరి పంట వేయాలని,పంట కొనని టీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టండని రేవంత్ రైతులకు పిలునిచ్చారు.