Vijayasai Reddy : వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించాను.
2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.
నా రాజకీయ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 31, 2025
“నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నార్వే వెళ్లేందుకు అనుమతి కావాలంటూ విజయసాయిరెడ్డి ఇటీవల సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి పై పరిశీలన జరిపిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే రూ.5 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య 15 రోజులు విదేశాల్లో పర్యటించేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.